తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటు విషయం గురించి…ముఖ్యమంత్రి కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయదలచిన సైన్స్ సిటీ విషయమై అవసరమైన ప్రతిపాదనను పంపించమని కోరుతూ 15 డిసెంబర్, 2021 నాడు మొదటి లేఖను తాను రాశానని.. ఆ తర్వాత 22 ఫిబ్రవరి, 2022 నాడు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇదే విషయంపై లేఖను వ్రాయడం జరిగిందని తెలిపారు.
అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతి స్పందన రాకపోవడంతో 06 మే, 2022 నాడు మరో లేఖను నేను మీకు వ్రాయడం జరిగిందని గుర్తు చేశారు. సైన్స్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన DPR ను రూపొందించటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సాంకేతిక సహాయం అవసరమైతే, డైరెక్టర్ జనరల్, NCSM, కలకత్తా వారిని సంప్రదించినట్లయితే, వారు ఆ సహాయాన్ని అందించగలరని కూడా నేను మీకు చివరగా రాసిన లేఖలో తెలియజేశానన్నారు. ఇలా మూడు సార్లు మీకు లేఖలు వ్రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి ప్రతిస్పందన రాకపోవటంతో సైన్స్ సిటీ యొక్క ప్రాముఖ్యతను, ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను గురించి మరోసారి మీకు ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నానని చురకలు అంటించారు కిషన్ రెడ్డి.