ఏపీలో కొద్ది రోజులుగా కమ్మ వర్గం టార్గెట్‌గా రాజకీయం నడుస్తోంది. కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీ టార్గెట్‌గా చేస్తోందన్న విమర్శలు ప్రధానంగా టీడీపీ నుంచి వినిపించాయి. అమరావతి తరలింపు ఈ వర్గాన్నే టార్గెట్‌గా చేసుకుని చేశారన్న టాక్ వచ్చింది. అయితే ఆ తర్వాత జగన్ టీడీపీలోని కమ్మ నేతలను ప్రధానంగా ఆకర్షించారన్న అభిప్రాయం కూడా బలంగా వినిపించింది. ఈ క్రమంలోనే టీడీపీలో బలమైన కమ్మ నేతలు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీ చెంత చేరిపోయారు.
టీడీపీకి చెందిన పలువురు కమ్మ నేతలను కలుపుకుంటే జగన్ కమ్మలను టార్గెట్ చేస్తున్నాడన్న ప్రచారానికి బ్రేక్ పడుతుందన్న ప్లాన్ కూడా వైసీపీ అధిష్టానం వేస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో బలమైన కమ్మనేత, టీడీపీ వీరాభిమానిని కూడా వైసీపీ తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు టార్గెట్‌గా వైసీపీ రాజకీయం నడుస్తోందంటున్నారు. అక్కడ గ్రేటర్ ఎన్నికల్లో పాగా వేసేందుకు వైసీపీ కొద్ది రోజులుగా మాజీ మంత్రి గంటాతో రాయభారాలు సాగించింది.
గంటా వైసీపీ ఎంట్రీకి సొంత పార్టీలోనే చాలా మంది ఒప్పుకోలేదు. దీంతో గంటా కంటే ముందే కమ్మ వర్గానికి చెందిన వెలగపూడిని లాగేస్తే ఉత్తరాంధ్రలో టీడీపీకి ఉన్న ఒక్క కమ్మ ఎమ్మెల్యే కూడా వైసీపీ గూటికి వచ్చేసినట్లవుతుంది. ఇప్పటికే విశాఖ ఎంపీ సత్యనారాయణ కమ్మ నేతే. దీంతో వెలగపూడిని కూడా తిప్పేసుకుంటే ఇక విశాఖలో టీడీపీకి మూర్తి కుటుంబం మినహా ఎవ్వరూ ఉండరు. వెలగపూడి కృష్ణా జిల్లా వాసి. ఆయన కొన్నేళ్ల క్రితమే విశాఖలో స్థిరపడ్డారు. టీడీపీ నుంచి ఆయన మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.
వెలగపూడి ప్రధాన ఆదాయ వనరే మద్యం వ్యాపారం. ఇప్పుడు ఆ వ్యాపారం మూతపడింది. మూడుసార్లు గెలిచినా ఆయన రెండు సార్లు ప్రతిపక్షంలో ఉన్నారు. మొన్న ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారు. వీటితో పాటు తూర్పులో వైసీపీకి నేతల కొరత ఉంది. మూడు ఎన్నికల్లో గెలిచిన ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే తూర్పు నియోజకవర్గంలో మెజార్టీ కార్పొరేటర్లను గెలుచుకోవచ్చన్నదే వైసీపీ ప్లాన్.
మంత్రి కొడాలితో రాయభేరాలు :
వెలగపూడిని పార్టీలో చేర్చుకునేందుకు అదే కమ్మ వర్గానికి చెందిన మంత్రి కొడాలి నానితో రాయభారాలు నడుపుతున్నారట. పార్టీలోకి వస్తే ఓ నామినేటెడ్ పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో సీటు ఎలాగూ ఇస్తారు. ఇక ఆయనకు కొన్ని కాంట్రాక్టులు కూడా కట్టబెట్టేలా హామీలు ఇస్తున్నారని అంటున్నారు. మరి ఈ రాయభేరాలు ఫలిస్తాయా ? వెలగపూడి కండువా మారుస్తారా ? అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.
-vuyyuru subhash