ఆదివారం జీవో నెం. 317 భాదిత ఉద్యోగ ఉపాధ్యాయ జెఏసీ అధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మనోవేదన మహాసభ నిర్వహించబడింది. ప్రొఫెసర్ కోదండరాం ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడికి వచ్చిన బాధితులంతా ప్రొఫెసర్ కోదండరాంకు రాఖీలు కట్టి.. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మాతో పాటు కలసి పోరాడాలని వేడుకున్నారు.
ప్రొఫెసర్ కోదండరాం అక్కడ ప్రసంగిస్తూ జీవో నెం. 317 భాదితులు అందరూ కలసి కట్టుగా పోరాడాలని వెల్లడించారు. స్థానిక రిజర్వేషన్ ప్రకారం ఏ జిల్లాల వారికి.. ఆ జిల్లాల్లోనే రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. జీవో నెం. 317 విషయంలో స్థానికత ప్రాతిపదిక తీసుకోకుండా సీనియారిటీ ప్రాతిపదికను తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయులను వేధిస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం కోప్పడ్డారు. తెలంగాణలోని 8 జిల్లాలలో ఇదే సమస్య ఉన్నట్లు తెలిపారు ఆయన. స్థానికత ఆధారంగా ఏర్పడిన తెలంగాణలో స్థానికత అనే పదం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల ప్రభుత్వం వెంటనే పరిష్కారించాలని కోదండరాం డిమాండ్ చేశారు.