జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని షేక్ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో వ్యాపార సంబంధాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతుంటే… కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ టమాటా వ్యాపారులు ముందుగా స్పందించారు. దేశంపై ప్రేమను చాటుతూ, పాకిస్థాన్‌కు టమాటాల ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు వారు ప్రకటించారు.

ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా గుర్తింపు పొందిన కోలార్‌లో రోజూ 800–900 టన్నుల వరకూ టమాటా వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా జూన్ నెల ఎగుమతుల పరంగా చాలా కీలకం. అయినప్పటికీ, పహల్గామ్ ఘటన నేపథ్యంలో దేశం ముందు ధన లాభాలు అణగదొక్కాలని నిర్ణయం తీసుకున్నారు. “దేశ భద్రతకు తాము ప్రాధాన్యత ఇస్తామే గానీ, ఒక్క టమాటా కూడా పాకిస్థాన్‌కు పంపేది లేదు” అని వ్యాపారులు తేల్చిచెప్పారు.
గతంలో కూడా పాక్‌లోని ప్రజల కోసం మానవతా దృక్పథంతో వ్యాపార సంబంధాలు కొనసాగించినప్పటికీ… అమాయకులపై జరిగిన నిష్ఠుర దాడి తర్వాత తాము తలంపు మార్చుకున్నామని వెల్లడించారు. “లాభనష్టాల కన్నా దేశ గౌరవం మాకు ముఖ్యమైనది” అని పేర్కొంటూ, తమ ఈ నిర్ణయం మిగిలిన వ్యాపారవర్గాలకు ఆదర్శంగా నిలవాలని ఆశించారు.