కొల్లాపూర్‌ లో కాకా రేపుతున్న టీఆర్ఎస్ వర్గపోరు

-

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మద్య వర్గ పోరు జోరుగా సాగుతోంది. సందర్భం ఏదైనా, ఎన్నికలేవైనా నేతల మధ్య వర్గ పోరు హైలైట్‌ అవుతోంది. ప్రభుత్వ కార్యక్రమం అయినా, పార్టీ ప్రోగ్రాం అయినా రచ్చకెక్కాల్సిందే. ఒకరిది పట్టు పెంచుకునే ప్రయత్నం. మరొకరిది పట్టు సడలకుండా జాగ్రత్త పడే ప్రయత్నం. ఇదే ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గంలో కాక రేపుతుంది.


గత ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ది, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన బీరం హర్ష వర్దన్ రెడ్డి గెలుపొందారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటి నుంచి కొల్లాపూర్ లో టిఆర్ఎస్ పార్టి జూపల్లి , హర్ష వర్ధన్ వర్గాలుగా చీలింది. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు ఇతర కార్యక్రమాల వేదికగా ఈ రెండు వర్గాలు రచ్చకెక్కడం ఇక్కడ కామన్ గా మారింది.

హర్షవర్దన్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిన తర్వత మొదలైన ఆధిపత్యపోరు పై టీఆర్ఎస్ పెద్దలు కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో జూపల్లి, హర్షవర్దన్ వర్గాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోన్న పరిస్థితి ఏర్పడింది. కొల్లాపూర్ లో జరిగే అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో స్వపక్షంలో విపక్ష పాత్రను ఓ వర్గం పోషిస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోందట. కొల్లాపూర్ లో అధికార పార్టీ కార్యక్రమం అంటే ఇప్పుడు పార్టీ కార్యకర్తలు టెన్షన్‌ పడే పరిస్థితి ఏర్పడిందటే, నేతల మధ్య ఏ స్థాయిలో విభేదాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ వర్గ పోరు కాస్తా క్షేత్ర స్థాయి వరకు పాకి క్యాడర్ కూడా రెండుగా చీలిపోయిన పరిస్థితి కొల్లాపూర్ నియోజక వర్గంలో కనిపిస్తోంది. అయితే పలు సందర్భాల్లో జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నియోజక వర్గంలో తన పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. క్యాడర్ ను కాపాడుకుంటూ పార్టీలో ఉనికి సడలకుండా ముందుకుపోతున్నారనే టాక్‌ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version