పదవి చిన్నదే…ప్రచారం పెద్దది…రేవంత్‌కు కోమటిరెడ్డి షాక్ ఇస్తారా?

-

మొన్నటివరకు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(komatireddy venkatreddy) ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. డబ్బులు ఇచ్చి రేవంత్ పీసీసీ కొనుక్కున్నారని, టీపీసీసీ, కాస్త టీటీడీపీ మాదిరిగా తయారైందని మాట్లాడారు. తనకు పీసీసీ రాలేదని బాధ తనలో ఉందని అన్నారు. ఇలా కోమటిరెడ్డి మాట్లాడటం వల్ల కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. అలాగే కోమటిరెడ్డి వ్యాఖ్యలు పరోక్షంగా రేవంత్‌కు నష్టం చేసేలాగానే ఉన్నాయి.

సరే కోమటిరెడ్డి ఇంతటితో ఆగిపోలేదు. వరుసపెట్టి బీజీపీకి చెందిన కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతూ ముందుకెళుతున్నారు. తన పార్లమెంట్ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నట్లు చెబుతున్న కోమటిరెడ్డి తాజాగా, కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు పీసీసీ చాలా చిన్న పదవి అని, రేవంత్ చిన్న నాయకుడు అని మాట్లాడారు.

అలాగే మర్రి, వైఎస్సార్‌లు మాస్ లీడర్లని, వారి నియోజకవర్గాల్లో ఏ ఎన్నికలు జరిగినా అభ్యర్ధులని గెలిపించుకునే సత్తా వారికి ఉందని, కానీ ఉత్తమ్, భట్టిలకు ఆ సత్తా లేదని అన్నారు. ఇక తాను అభివృద్ధి పనులు గురించి మాట్లాడటానికే కిషన్ రెడ్డితో భేటీ అయినా, పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఇలా మాట్లాడటం వల్ల కూడా కాంగ్రెస్‌లో పార్టీని గెలిపించుకునే సత్తా గల నాయకులు పెద్దగా లేరని కోమటిరెడ్డి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.

అలాగే మొన్నటివరకు ఆయన పీసీసీ కోసం హడావిడి చేసి, ఇప్పుడు చిన్న పదవి అని మాట్లాడటం కరెక్ట్ కాదని రేవంత్ వర్గం అంటుంది. ఈయన మాటల వల్ల కాంగ్రెస్‌కే డ్యామేజ్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా బీజేపీ, కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఫోకస్ చేసిందని తెలుస్తోంది. గతంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి చూసి ఆగిపోయారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version