రేవంత్ రెడ్డికి పిసిసి పదవి వచ్చిన దగ్గర నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. రేవంత్, చంద్రబాబు మనిషి అని, టిపిసిసి కాస్త టిటిడిపి మాదిరిగా మారిపోయిందని విమర్శించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కోమటిరెడ్డి, రేవంత్‌ల మధ్య మాటలు లేవు. వారి మధ్య అంతర్గతంగా వార్ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వీరి వైఎస్సార్ సంస్మరణ సభ చిచ్చు పెట్టింది.
ఇదే సమయంలో రేవంత్, సీతక్కలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వేరే పార్టీ అధ్యక్షుల ఇళ్లకు వెళ్ళి కాళ్ళు మొక్కలేదని, రాఖీలు కట్టలేదని మాట్లాడారు. . అలాంటిది కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం సంస్మరణ సభకి వెళ్లొద్దనడం సరికాదంటూ కోమటిరెడ్డి చెప్పొకొచ్చారు. అయితే రేవంత్, చంద్రబాబు మనిషే అని తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అటు సీతక్క సైతం ఈ మధ్య చంద్రబాబు ఇంటికెళ్ళి ఆయనకు రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్నారు.
తాను చంద్రబాబు మనిషి అని వస్తున్న విమర్శలకు రేవంత్ ఇటీవల గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. తాను చంద్రబాబు మనిషి అన్నవారిని చెప్పుతో కొట్టాలని ఘాటుగా మాట్లాడారు. అటు సీతక్క సైతం..తాను మొదట నుంచి చంద్రబాబుకు రాఖీ కడుతున్నానని, రాజకీయం వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరని, రెండు కలిపి మాట్లాడే వారికి బుద్ధి లేదని సీతక్క సైతం ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్, సీతక్కలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా ఈ లొల్లి వల్ల కాంగ్రెస్‌కే డ్యామేజ్ అయ్యేలా కనిపిస్తోంది.