తెలంగాణ రాజకీయాల్లో మాటల మంటలు చెలరేగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మధ్య సవాళ్ళ పర్వం నడిచింది. గతంలో కేటీఆర్ డ్రగ్స్ వాడుతున్నారని, దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రెడీ అవ్వాలని బండి సవాల్ చేశారు. కావాలంటే నా జుట్టు, రక్తం, అవసరమైతే కిడ్నీలు ఇస్తానని దమ్ముంటే డాక్టర్‌ని తీసుకువచ్చి పరీక్షించాలని, తాను క్లీన్ చీట్ తో బయటకు వస్తే కరీంనగర్ కమాన్ దగ్గర ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకుంటారా అని బండికి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
ఆ వెంటనే కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా బండి కూడా స్పందించారు..” నీ కుటుంబం మళ్లీ వస్తే… చెప్పులు ఇప్పి నెత్తి మీద పెట్టుకుని నడవాలి. నేను తంబాకు తీసుకున్నట్టు ఆధారాలున్నాయా?” అని బండి ఫైర్ అయ్యారు. ఇలా ఓ వైపు బండి-కేటీఆర్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే..మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి-కవితల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ రిపోర్టులో కవిత పేరు 28 సార్లు రావడాన్ని కోమటిరెడ్డి ప్రస్తావించారు. దీనికి కౌంటరుగా కవిత..” రాజగోపాల్ అన్న తొందర పడకు, మాట జారకు, 28 సార్లు నా పేరు ప్రస్తావించినా..28 వేల సార్లు నా పేరు చెప్పించినా..అబద్దం నిజం కాదు..ట్రూత్ విల్ ప్రివెయిల్” అంటూ ట్వీట్ చేశారు.
ఆ వెంటనే కోమటిరెడ్డి సైతం కవితకు కౌంటర్ ఇచ్చేశారు. “నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ..నువ్వు లిక్కర్ స్కామ్‌లో ఉన్నది నిజం..జైలుకు వెళ్ళడం ఖాయం. నిన్ను మీ అన్న, మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు” అంటూ కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. అలాగే మునుగోడులో తాను 18 వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నానని కేటీఆర్ అబద్దాలు ప్రచారం చేశారని, అవినీతి మాయమైన మీ కుటుంబం జైలుకు వెళ్ళడం ఖాయమని కోమటిరెడ్డి అన్నారు.