హుజూరాబాద్ ఉపఎన్నికలో మొన్నటివరకు కాంగ్రెస్ తరుపున కొండా సురేఖ బరిలో దిగుతారని ప్రచారం నడిచిన విషయం తెలిసిందే. అలాగే ఈ విషయంపై సురేఖ కూడా క్లారిటీ ఇచ్చారు..ఒకవేళ హుజూరాబాద్‌లో పోటీకి దిగినా..తాను వరంగల్‌కు మళ్ళీ వస్తానని కూడా చెప్పారు. అయితే ఇదే సమయంలో తమకు మూడు సీట్లు ఇస్తే హుజూరాబాద్‌లో పోటీ చేస్తానని సురేఖ….టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు డిమాండ్ పెట్టారని కథనాలు కూడా వచ్చాయి.
వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి, పరకాల సీట్లు కావాలని సురేఖ పట్టుబట్టారు. కానీ రేవంత్ అందుకు ఒప్పుకోలేదు. భూపాలపల్లి సీటు తన సన్నిహితుడు గండ్ర సత్యనారాయణకు ఇవ్వాలని రేవంత్ ముందే ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టుగానే ఆయన్ని బిజేపి నుంచి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారు. ఇక ఈ విషయంలో సురేఖ కూడా ఒప్పుకోకపోవడంతో, హుజూరాబాద్‌లో యువ నాయకుడు బల్మూరి వెంకట్‌ని బరిలోకి దింపారు. సరే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఎలాంటి ఫలితం వస్తుందనే విషయాన్ని పక్కనబెడితే, అసలు కాంగ్రెస్‌లో కొండా దంపతులు ఎలా పనిచేస్తారనేది క్లారిటీ లేకుండా ఉంది.
మొదట కాంగ్రెస్‌లోనే రాజకీయ జీవితం మొదలుపెట్టిన కొండా సురేఖ… ఆ తర్వాత వైసీపీ, టిఆర్‌ఎస్…..మళ్ళీ చివరికి కాంగ్రెస్‌లోకే వచ్చారు. అయితే కొండా సురేఖ డిమాండ్లు ఎక్కువగా ఉండటం, దానికి కాంగ్రెస్ ఒప్పుకోవడంతో మళ్ళీ రాజకీయంగా ఎలాంటి స్టెప్ వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొండా దంపతులు కోరినట్లు మూడు సీట్లు ఇవ్వడమైతే జరగని పని అని తెలుస్తోంది.
వరంగల్ ఈస్ట్, పరకాల సీట్ల విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు గానీ, భూపాలపల్లి సీటు విషయంలో మాత్రం రేవంత్ వెనక్కి తగ్గడం లేదు. ఆ సీటుని గండ్ర సత్యనారాయణకు దాదాపు ఫిక్స్ చేసేశారు. మరి ఈ విషయంలో కొండా దంపతులే వెనక్కి తగ్గాలి. మరి వెనక్కి తగ్గకపోతే ఉన్న సీట్లు కూడా పోయేలా ఉన్నాయి. మరి రాజకీయంగా కొండ దంపతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.