కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో పనిచేసే రాష్ట్ర ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సును రద్దు చేయాలని బోర్డు ఛైర్మన్ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించారు. అంతేకాకుండా ఇప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటయ్యాయి. ఇక్కడ పని చేసేందుకు డిప్యూటేషన్‌పై వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలని 2021లో బోర్డు నిర్ణయం తీసుకుంది.
అయితే కృష్ణా బోర్డులో పనిచేసే వారికి మాత్రమే ఈ సదుపాయాన్ని వర్తింపజేసింది. గోదావరి బోర్డులోనూ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నుంచి కృష్ణా బోర్డుకు వచ్చేవారికి బేసిక్‌లో 25 శాతం ప్రత్యేక అలవెన్సు ఇస్తే ఇతర బోర్డుల్లో పనిచేసే వారి నుంచి కూడా డిమాండ్లు వస్తాయని తెలిపింది. ఆ ప్రత్యేక అలవెన్సును ఉపసంహరించుకోవాలని బోర్డు సూచించింది. దీనిపై 2021 జులైలో ఆదేశాలు కూడా జారీ చేయగా.. కృష్ణా బోర్డు ఛైర్మన్ తాజాగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.