గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు మోసపోయిందని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పలు అభివృద్ధి పనులతో పాటు రూ. 5 కోట్లతో నిర్మించనున్న మున్సిపల్ భవనం, కళాక్షేత్రం భవనాలకు బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతి ఉత్సవ సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడితే చీకట్లు కమ్ముకుంటాయని నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.. కానీ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే కరెంటు కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ ని వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటలూ సరఫరా చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలోని కొంత మంది కాంగ్రెస్ నాయకులు జిల్లాకు శాపంగా మారారు. సీఎం కేసీఆర్ ఏ పని ప్రారంభించిన సరే.. కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధికి ఆటంకంగా మారారు. వారు 50 సంవత్సరాలుగా చేసిందేమి లేదు..ఇప్పుడు చేస్తుంటే అడ్డుతగులుతున్నారు.. అయినా సరే పనులు ఆగవు.. అభివృద్ధి ఆగదు అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తన ఇంట్లో మనవలు ఏ బియ్యం తింటున్నారో అదే బియ్యాన్ని పాఠశాల విద్యార్థులు కూడా తినాలనే సంకల్పంతో
సీఎం కేసీఆర్ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్కో వ్యక్తికి 4 కిలోల బియ్యం ఇస్తే..ఇప్పుడు దానిని 6 కిలోలకు పెంచాం.. ప్రైవేటు పాఠశాలలకు ఏ మాత్రం తీసుపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందిస్తున్నామన్నారు.
అధికారంలోని రావడం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలను ఇస్తుందని మండిపడ్డారు. నాడు రైతులను కాల్చిచంపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారిపై కపట ప్రేమను చూపించడం విడ్డూరం అన్నారు. 50 ఏళ్లుగా వారు చేసిన పాపాలను కడిగేందుకు నాలుగేళ్ల సమయం చాలదు… మరి కొద్ది సంవత్సరాలు పడుతోంది. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. కొంత మంది ఏపీలోనూ తెరాస పార్టీని ఈ సారి ఎన్నికల బరిలో ఉంచాలని కోరుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో షాద్ నగర్.. శంషాబాద్ ని మించిపోతుంది… షాద్ నగర్ పరిసర ప్రాంతాల నుంచి మరో రింగు రోడ్డుని ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో నిర్మించ తలపెట్టినట్లు కేటీఆర్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తమ ఓటుని తెరాసకు వేసి మరో సారి ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు.