మున్సిపల్ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని కేటీఆర్ తెలిపారు. దీని కోసం వరంగల్ అర్బన్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీని నియమించారు. భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
పెద్ద పెద్ద నిర్మాణాలు తొలగించడానికి భారీ యంత్రాలు తెప్పించాలని, ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పని వెంటనే ప్రారంభం కావాలని పేర్కొన్నారు. నెల రోజుల్లోగా మొత్తం ఆక్రమణలు తొలగించాలన్నారు. పద్దతి ప్రకారం నగరాభివృద్ది జరగాలనే ఉద్దేశ్యంతోనే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చామని పేర్కొన్నారు . దానికి తోడు వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమయింది ఆయన తెలియజేశారు.