తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ జిహెచ్ఎంసి, జలమండలి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్…ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా అన్ని పురపాలికలు పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలను వేగంగా ముందుకు తీసుకుపోవాలని సూచనలు చేశారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల పైన కూడా ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని అధికారులకు కేటీఆర్ ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాల వలన పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలని కేటీఆర్ సూచనలు చేశారు.
ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాల పైన ప్రధాన దృష్టి సారించి హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలి..స్థానికంగా ఉన్న పోలీస్, సాగునీటి, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచనలు చేశారు కేటీఆర్. హైదరాబాద్ నగరం మరియు పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలి కలిసి వరద నివారణ/తగ్గింపు చర్యలు చేపట్టాలి..ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు.