ఇప్పుడు ఎక్కడ చూసినా బలగం సినిమా పాటలే. ఎవరిని అడిగినా బలగం సినిమా మాటే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రతిఒక్క సినీ ప్రేక్షకుడి నోటిలో నానుతోన్న సినిమా బలగం. ఇంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాను తీసింది ఏ పేరు మోసిన డైరెక్టరో కాదు. కమెడియన్‌గా తన సినీ ప్రస్థానం మొదలు పెట్టి రచయితగా ఒక్కో మెట్టు ఎదిగి చివరకు డైరెక్టర్‌గా మారిన టిల్లు వేణు.. అదేనండి జబర్దస్త్ వేణు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ముఖ్యంగా ఎమోషన్‌ను అచ్చుగుద్దినట్టు దింపిన బలగం సినిమాను రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా వీక్షించారు. ఆ సినిమా తీసిని డైరెక్టర్ యెల్దండి వేణును కేటీఆర్ అభినందించారు. మూవీ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలతో ముంచెత్తారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం అనంతరం.. అక్కడికి వేణును ఆహ్వానించారు. వేణును మంత్రి ఆలింగనం చేసుకుని, శాలువాతో సత్కరించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారని వేణును కేటీఆర్ అభినందించారు. తక్కువ బడ్జెట్‌తో సమాజానికి దోహదపడేలా ‘బలగం’ లాంటి సినిమాలు తీయాలని, కమర్షియల్ సినిమాల వైపు ఇప్పుడే వెళ్లొద్దని సూచించారు. మంచి సినిమాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, దీనికి ఉదాహరణ ‘బలగం’ సినిమానే అని పేర్కొన్నారు.