ఆ ఓటీటీలో లాల్‌ సింగ్‌ చడ్డా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

-

బాలీవుడ్ సూపర్‌స్టార్‌ ఆమీర్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న విడుదలై, ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదలైనప్పుడు, ఆరునెలల తరువాతే ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్‌ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వచ్చే నెల(అక్టోబర్‌)20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ గిరీశ్‌ జోహార్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా మిగిల్చిన నష్టాన్ని తగ్గించేందుకు ఓటీటీలో త్వరగా విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర నిర్మాతలకు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరినట్లు ఆయన వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి ఆ చిత్రబృందం, ఓటీటీ సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


ఇదిలా ఉండగా లాల్‌ సింగ్‌ చడ్డా విడుదలకు ముందు ఒక ప్రచార కార్యక్రమంలో ఈ చిత్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ బాలీవుడ్‌ సినిమాల వరుస వైఫల్యానికి ఓటీటీలు కూడా కారణమంటూ విమర్శించారు. సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో ప్రసారమైతే ఇక ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వెళ్తారంటూ ప్రశ్నించారు. లాల్ సింగ్‌ చడ్డా విడుదలైన ఆరునెలల తర్వాతే ఓటీటీలో విడుదలవుతుందంటూ అప్పుడు ఆమీర్‌ ప్రకటించారు. కానీ నెలరోజులకే ఈ సినిమా ఓటీటీ విడుదలపై వార్తలు రావడం గమనార్హం.

దాదాపు రూ.180 కోట్లతో రూపొందించిన లాల్‌ సింగ్‌ చడ్డా ప్రపంచవ్యాప్తంగా రూ.120కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది. ఫారెస్ట్‌ గంప్‌(1994) అనే ఆంగ్ల చిత్రం రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. ఆమిర్‌ఖాన్‌, కరీనాకపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించగా, నాగచైతన్య కీలకపాత్ర పోషించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version