తమిళనాడులో వింత పరిస్థితి నెలకొంది. గర్భ నిరోధక మాత్రలపై అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. అక్కడ ప్రభుత్వం సదరు మెడిసిన్లను నిషేధించలేదు. అయినప్పటికీ మెడికల్ షాపుల్లో ఆ మాత్రలు లభించడం లేదు. ఇక దీనికి లాక్‌డౌన్ కూడా తోడవడంతో అక్కడ అవాంఛిత గర్భాల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అక్కడి గైనకాలజిస్టులు, మేథావులు, మహిళా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐపిల్ అనేది గర్భనిరోధక మాత్ర. కలయిక అనంతరం గర్భం వస్తుందని భావిస్తే 72 గంటల్లోగా దీన్ని వాడాల్సి ఉంటుంది. ఇది దేశంలో అందుబాటులో ఉన్న పలు ఉత్తమమైన గర్భ నిరోధక సాధనాల్లో ఒకటిగా ఉంది. అయితే 2016 నుంచే తమిళనాడులో ఈ మెడిసిన్లను అమ్మడం మానేశారు. దీంతో అక్కడ ఈ మెడిసిన్ లభించడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఈ మెడిసిన్‌ను తెచ్చుకుని మహిళలు వాడుతున్నారు. అయితే 2019లో తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ మెడిసిన్లను నిషేధించలేదని తెలిపింది. అయినప్పటికీ ఐపిల్‌ను అక్కడ ఎందుకు విక్రయించడం లేదో అసలు తెలియడం లేదు.
అయితే లాక్‌డౌన్ వల్ల తమిళనాడులో మహిళలకు సదరు ఐపిల్స్ దొరక లేదు. దీంతో అక్కడ ప్రస్తుతం అవాంచిత గర్భాల కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మొత్తం 1,24,086 మంది గర్భం వద్దని కోరుకుంటున్నారని వెల్లడైంది. అయితే దీని వల్ల కొందరు పిల్లల్ని కనాలని అనుకున్నా.. అధిక శాతం మంది మాత్రం అబార్షన్ల వైపు మళ్లే అవకాశం ఉందని గైనకాలజిస్టులు అంటున్నారు. దీని వల్ల 91 ప్రసూతి మరణాలు సంభవించే అవకాశం ఉందని, ఆయా మహిళలకు అనారోగ్య సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనిపై మేథావులు, మహిళా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని తమిళనాడు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందా.. అని వారు సందేహిస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.