ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు లెనోవో తన కస్టమర్లతోపాటు ఇతర కంపెనీలకు చెందిన కంప్యూటర్లను వాడే వినియోగదారులకు కూడా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ వల్ల పీసీలకు సర్వీసింగ్ చేయించలేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఉచితంగా సర్వీసింగ్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. లెనోవోతోపాటు ఇతర బ్రాండ్లకు చెందిన డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ పీసీలను వాడేవారు.. తమ పీసీలో ఏదైనా సమస్య ఉంటే లెనోవో టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి.. ఉచితంగా తమ తమ పీసీల సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
భారత్‌లో ఉన్న పీసీ యూజర్లు లెనోవో అందిస్తున్న ఉచిత సర్వీసింగ్ ఆఫర్‌ను వినియోగించుకోవాలంటే.. 1800-149-5253 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్లు తమ పీసీల్లో నెలకొనే చిన్నపాటి సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచచ్చు. ఆపరేటింగ్ సిస్టం లేదా సాఫ్ట్‌వేర్ల ఇన్‌స్టాలేషన్, ప్రింటర్లు, స్కానర్లు తదితర డివైస్‌ల ఇన్‌స్టాలేషన్, పీసీ నెమ్మదిగా రన్ అవుతున్నా.. టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే.. లెనోవో టెక్నిషియన్లు వచ్చి సమస్యను పరిష్కరిస్తారు.ఇందుకు గాను ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన పనిలేదని, ఉచితంగానే ఆ సేవలను అందిస్తామని లెనోవో తెలిపింది.
ఈ సందర్భంగా లెనోవో ఇండియా సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్ వల్ల దేశంలో ఎంతో మంది తమ కంప్యూటర్లలో వచ్చిన సమస్యలను పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారి కోసమే ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. మే 3వ తేదీ లాక్‌డౌన్ ముగిసే వరకు ఈ సేవలను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని తెలిపారు.