ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా టోర్నీకి మరో 3 వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో 8 ఫ్రాంచైజీలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐపీఎల్, క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల ఆలస్యం అయింది. కాగా ఇప్పటికే ఆయా జట్లకు చెందిన సభ్యులు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో అందరూ ఐపీఎల్ షెడ్యూల్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
అయితే ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లకు యూఏఈ ప్రభుత్వం క్వారంటైన్ రూల్స్ నుంచి మినహాయింపునిచ్చిందని తెలుస్తోంది. అలాగే ఐపీఎల్ జరగనున్న దుబాయ్, షార్జా, అబుధాబిలలో ప్లేయర్లు, సిబ్బంది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా సులభంగా ప్రయాణించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని సమాచారం. అందువల్ల ఐపీఎల్‌కు దాదాపుగా లైన్ క్లియరైనట్లేనని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ షెడ్యూల్‌ను ఏ క్షణంలో అయినా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా చెన్నై జట్టులో కరోనా కలకలం ఉండడంతో సెప్టెంబర్ 19న జరగనున్న ఆరంభ మ్యాచ్ లో ఆ టీంకు బదులుగా ముంబైతో బెంగళూరు తలపడుతుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైతే ఈ విషయంపై కూడా స్పష్టత వస్తుంది.