లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు తాత్కాలిక ఊరట లభించింది. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలుసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు ఆయనకు అనుమతినిచ్చింది. కస్టడీలో ఉన్నప్పటికీ ఆయన ఈ నెల 3 న.. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తన భార్యను కలుసుకోవచ్చునని కోర్టు శుక్రవారం రూలింగ్ ఇచ్చింది.ఆమె మెడికల్ రికార్డులను రేపు ఉదయం కల్లా సమర్పించాలని ఆదేశించింది. సిసోడియా భార్య పలు రుగ్మతలతో బాధపడుతున్నారు.
సిసోడియాను తన భార్యను చూడడానికి తన నివాసానికి తీసుకెళ్లాలని జస్టిస్ దినేష్ కుమార్ శర్మ తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఇందుకు కొన్ని షరతులు కూడా విధించింది. సిసోడియా తన కుటుంబ సభ్యులతో తప్ప మీడియాతో లేదా మరే ఇతర వ్యక్తులతో మాట్లాడరాదని తెలిపింది. ఫోన్ లో సంభాషించరాదని, ఫోన్ లేదా ఇంటర్నెట్ యాక్సెస్ చేయరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.