కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రకటించిన లాక్‌డౌన్ 3.0 రేపటితో (మే 17) ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ 4.0ను ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో లాక్‌డౌన్‌ను ఎత్తేసే ఊసే లేదు. కనుక లాక్‌డౌన్ 4.0 కొనసాగుతుందని స్పష్టమవుతుంది. అయితే ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో కేంద్రం ఇంకా ఏయే కార్యకలాపాలకు అనుమతిస్తుంది, ఏయే ఆంక్షలను సడలిస్తుంది..? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు ఆయా అంశాలకు గాను పలు కొత్త మార్గదర్శకాలను కేంద్రం ఇవాళ (మే 16) విడుదల చేయనుంది.
లాక్‌డౌన్ 4.0లో భారీ ఎత్తున ఆంక్షలను కేంద్రం సడలించనున్నట్లు తెలిసింది. ఈ దశలో రైళ్లు, దేశీయ విమాన ప్రయాణాలు దశల వారీగా అమలవుతాయని సమాచారం. అలాగే కరోనా హాట్‌స్పాట్లను నిర్ణయించే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇస్తుందని తెలిసింది. ఇక ప్రధాని మోదీ ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చలు జరిపిన నేపథ్యంలో అందరూ లాక్‌డౌన్‌ను పొడిగించాలనే చెప్పారు కనుక.. లాక్‌డౌన్ 4.0 అనివార్యమని తెలుస్తోంది.
లాక్‌డౌన్ 4.0 లో భాగంగా ఎప్పటిలాగే కళాశాలలు, పాఠశాలలు, మాల్స్, థియేటర్లు, బార్లు, పబ్బులు, క్లబ్బులకు అనుమతి ఉండదని తెలిసింది. ఇక కంటెయిన్‌మెంట్ జోన్లు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలను పాటిస్తూ సెలూన్లు, ఆప్టికల్ షాపులను తెరిచేందుకు అనుమతిస్తారని సమాచారం. అలాగే కంటెయిన్‌మెంట్ జోన్లు లేని ప్రాంతాల్లో దాదాపుగా పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనున్నారని తెలిసింది. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం కానుంది. ఇక రెడ్ జోన్లలో మార్కెట్లను తెరిచే అధికారాలను సైతం రాష్ట్రాలకే ఇస్తారని సమాచారం.
అత్యవసరం కాని వస్తువులను విక్రయించే దుకాణాలకు సరి బేసి విధానంలో అనుమతులు ఇస్తారని తెలుస్తోంది. ఈ-కామర్స్ సంస్థలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇస్తారని సమాచారం. ఇక కుటీర పరిశ్రమలకు సడలింపులు ఇస్తారని, టూరిజంపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది.