చంద్రబాబు జోలికి వచ్చి జగన్ పెద్ద తప్పు చేశాడు : లోకేశ్‌

-

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో టీడీపీ అధినేత జైలు పాలైన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో నారా లోకేశ్ రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ, పాముకు తలలోనే విషం ఉంటుందని, జగన్ కు ఒళ్లంతా విషమేనని అన్నారు. చంద్రబాబు జోలికి రావడం సైకో జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని పేర్కొన్నారు లోకేశ్‌. జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని హెచ్చరించారు. జగన్ ను డైరెక్ట్ గా అడుగుతున్నా… నీ చరిత్ర ఏంటి? జగన్ నీపై ఎన్ని కేసులున్నాయి? వాటి వివరాలను మాలాగా పబ్లిగ్గా చెప్పగలవా? అంటూ సవాల్ విసిరారు లోకేశ్‌.

జగన్ పై 38 కేసులున్నాయి… వాటిలో 10 సీబీఐ కేసులు, 7 ఈడీ కేసులు, 21 ఇతర కేసులున్నాయి… జగన్ పై కేసులు పదేళ్లుగా ట్రయల్ కూడా రావడంలేదు… జగన్ ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది అని విమర్శించారు. మా కంపెనీకి డబ్బు వచ్చిందంటున్నారు… ఎలా వచ్చిందో చెప్పలేకపోయారు… మా కంపెనీ వ్యవహారాలన్నీ పారదర్శకమే. మా కుటుంబ సభ్యులమే డైరెక్టర్లుగా ఉన్నాం. మా ఆస్తులు, వాటాలు, షేర్ల వివరాలు కూడా బయటపెట్టాం. ఎందుకీ దొంగ కేసులు, కక్ష సాధింపులు? అంటూ లోకేశ్ మండిపడ్డారు.

2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, రెండేళ్ల తర్వాత, అది కూడా 36 మంది తర్వాత 37వ వాడిగా చంద్రబాబు పేరు చేర్చారని లోకేశ్ అన్నారు. ఇంతకంటే కక్ష సాధింపు ఉంటుందా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జోహో సంస్థ సీఈవో శ్రీధర్ వెంబు తదితరులు ఖండించారని లోకేశ్ వెల్లడించారు. పింక్ డైమండ్, వివేకానందరెడ్డి హత్య, కోడి కత్తి కేసుల్లో ఎంత అబద్ధం ఉందో ఈ కేసులోనూ అంతే అబద్ధం ఉందని అన్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు, ఆయనకు చెందినవారి ఖాతాల్లోకి సొమ్ము వెళ్లిందన్న ఆరోపణలను నిరూపించలేకపోయారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version