టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో లోకేశ్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. లోకేశ్ తన పదునైన ప్రసంగంతో సీఎం జగన్, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో అధికార పార్టీ నేతలను ఏకిపారేశారు. అద్దంకిలో భారీ జనసందోహాన్ని చూస్తుంటే ఉత్సాహం రెట్టింపవుతోంది. అద్దంకిలో మాస్ జాతర అదిరిపోయింది. రెడ్డి రాజులు పాలించిన నేల అద్దంకి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలు ఉన్న పుణ్యభూమి అద్దంకి. దేశం కోసం పోరాడిన ప్రకాశం పంతులు గారు నడిచిన నేల అద్దంకి. వరుసగా నాలుగు సార్లు మన పులి రవి గారిని గెలిపించిన నేల అద్దంకి. ఎంతో ఘన చరిత్ర ఉన్న అద్దంకి గడ్డపై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
మన జయహో బీసీ కార్యక్రమం చూసి జగన్ గజ గజా వణికిపోయాడు. గల్లీ నుండి ఢిల్లీ వరకూ వైసీపీ బీసీ నేతల్ని రంగంలోకి దింపి నన్ను తిట్టించాడు. కనీసం నన్ను తిట్టడానికైనా వైసీపీలో ఉన్న బీసీ నేతలకి మాట్లాడే అవకాశం ఇచ్చాడు.. అందుకు సంతోషం! 15 ఏళ్ల పిల్లాడు అమర్నాథ్ గౌడ్ ని కాళ్లు, చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడితే వైసీపీ బీసీ నాయకులు ఏం అయ్యారు? 5వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగితే వైసీపీలో ఉన్న బీసీ నేతలు గొంతు విప్పలేదు.