ఆరోజు నాకు తెలియదు.. నేను చెప్పే అబద్దం నేను ప్రేమించిన అమ్మాయి జీవితాన్నే మార్చేస్తుందని. ఇన్ని సంవత్సరాల తరువాత తెలిసింది ఆ అబద్ధం వల్ల జరిగిన అనర్థం.. బంధాలు తెగిపోవడమే కాక ఒక్కోసారి జీవితాలను బలి తీసుకుంటుంది.. నిజానికి నేను చేసింది చిన్న తప్పే కానీ దాని ఫలితం చాలా పెద్దది.. ఇప్పుడు నేను పశ్చాత్తాపపడి లాభం లేదు.. తనతో నేను మాట్లాడాలని చేసిన ప్రయత్నం వృద్ధాగా మిగిలిపోయింది. అంతేగా తను నా వల్లే కదా నష్టపోయింది..
నా ఇంటర్నీడియట్ పూర్తయ్యింది ఎంసెట్‌లో కూడా మంచి ర్యాంకు రావడంతో హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. కాలేజీ మొదలైన వారం రోజుల తర్వాత తను మా కాలేజ్‌లో జాయిన్ అయ్యింది. తొలి చూపులో ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసి వచ్చింది.. మెత్తానికి తనతో నా స్నేహం మొదలైంది.. తను కూడా నాతో చాలా క్లోజ్‌గా ఉండేది.. నేను హస్టల్‌లో ఉండటం వల్ల తనూ నా కోసం తినడానికి చికెన్ ఫ్రై తీసుకొచ్చేది.. వాళ్ళ అమ్మ చేతి వంట అమోఘం.
నేను తనని ప్రేమిస్తున్న విషయం చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నం చేశా కానీ ధైర్యం సరిపోలేదు.. ఎక్కడ తను నో చెప్తుందోనని చెప్పలేకపోయేవాడిని.. ఎవ్వరికైనా ఏవిషయాన్ని అయినా పంచుకోవడానికి స్నేహితులు ఉంటారు. నాకు అలాగే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో నేను అన్ని షేర్ చేసుకునేవాడిని. అలాగే నా ప్రేమ విషయం కూడా వాళ్ళకి చెప్పాను.
బీ టెక్ మూడు సంవత్సరాలు పూర్తయ్యి నాలుగో సంవత్సరం లోకి అడుగు పెట్టేసరికి ఆమెతో పరిచయం పెరిగి మేము మంచి స్నేహితులం అయ్యాము. వాళ్ల అక్క పెళ్ళిలో చాలా ఎంజాయ్ చేశాము.. మా అందర్ని వాళ్ళ అన్న, నాన్న చాలాబాగా చూసుకున్నారు . మేమందరం ఫిక్స్ అయ్యాం.. తను నన్ను ప్రేమిస్తుందని.. నా స్నేహితులు నా మీద ఎక్కువ ఒత్తిడి తెచ్చారు.. తను అమ్మాయి కదా ఆమె బయటపడదు, ఇప్పటికైనా వెళ్లి నీ ప్రేమ తనతో చెప్పమని.
సరే ఆ రోజు నా పుట్టినరోజు కూడా తను కాదనదు అనే దైర్యంతో తనతో చెప్పటానికి వెళ్ళా.. చెప్పేశా.. నిన్ను చాలా బాగా చూసుకుంటా.. నువ్వుంటే నాకు ఇష్టం.. ఇష్టం మాత్రమే కాదు ప్రాణం అని.. తను మాత్రం సూటిగా సుత్తి లేకుండా చెప్పేసింది.. నో అని… నాకు కోపం రాలేదు.. ఎందుకంటే.. తను ఎప్పుడూ నాతో మంచి ఫ్రెండ్‌లానే ఉంది.. ఇక్కడే నేను చేసిన అతి పెద్ద తప్పు..
ఆ చిన్న అబద్దం నన్ను ఇప్పటికీ వేదిస్తుంది.. ఆ చిన్న అహం నా స్నేహితురాలిని జీవితాన్ని నాశనం చేసింది.. అవును ఆ అబద్ధమే తన ఆశలపై నీళ్ళు పోసింది.. తనకు మంచి జాబ్ చెయ్యాలని, వాళ్ళ అమ్మా నాన్నలను మంచిగా చూసుకోవాలని, తన చదువు కోసం తాకట్టు పెట్టిన పొలాన్ని విడిపించాలని కోరిక ఉండేది.. ఇవే నాకు తనలో నచ్చినవి..
తను నా ప్రేమని కాదన్నదని నా స్నేహితులకు తెలిస్తే అమ్మో.. భరించలేను.. అందుకే తను కూడా నన్ను ప్రేమిస్తుందని చెప్పాను. ఎప్పటిలానే నేను తనతో ఉన్నా.. కాకపోతే తను కొంచెం ఇబ్బందిగా ఉంటోందని అర్థమైంది. ఏమైందో ఏమో ఉన్నట్టుండి తను కాలేజ్ రావడం మానేసింది.. వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగితే తను వాళ్ల అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిందని, ఎగ్జామ్స్ రాయటానికి వస్తుంది అని చెప్పారు.
తను రోజూ గుర్తొచ్చేది.. ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న నాకు ఒక రోజు తన పెళ్ళి అయిపోయిందని తెలిసింది.. నమ్మలేకపోయా.. ఇంత సడెన్‌గా ఏంటి ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా చేసేశారు అనుకున్నాం.. రోజూ తనని తలుచుకుంటూ బాధపడేవాన్ని.. ఫ్రెండ్స్ కూడా ఆడాళ్ళు అంతే అంటూ ఓదార్చేవారు.. ఆమెని మర్చిపోవడానికి, జీవితంలో ఎదగడానికి ఉద్యోగం చేస్తూ చేస్తూ మెత్తానికి సెటిల్ అయ్యా… నాకు కూడా పెళ్ళి ఫిక్స్ అయ్యింది.. ఫ్రెండ్స్‌కి కార్డ్స్ ఇద్దామని వచ్చిన నాకు నిజం తెలిసింది..
మా ఇద్దరి ప్రేమ విషయం వాళ్ల ఇంట్లో తెలిసి, ఆమె చదువును మధ్యలో ఆపేసి వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినట్టు తెలిసింది.. పెళ్ళైన కొన్ని రోజులకే ఆమె భర్త తనని బాగా టార్చర్ చేసేవాడట.. ఎవర్నో ప్రేమించావంటూ.. విషయం పెద్దల వరకు వెళ్ళి విడాకులు తీసుకున్నారని నా ఫ్రెండ్ చెప్పాడు. నాకు తనకు మాత్రమే తెలుసు మేం ప్రేమించుకోలేదని, కాని నేనే నా ఫ్రెండ్స్‌తో చెప్పిన అబద్దం.. అందరూ నిజమని నమ్మారు.. నాలో బాధ క్షణ క్షణం పెరుగుతుంది.
ఇప్పటివరకు నాకు మాత్రమే తెలిసిన ఆ అబద్దమనే నిజం.. నేను నిర్ణయించుకున్నా.. తనని పెళ్ళి చేసుకోవాలని.. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడా.. తను మాత్రం సూటిగా సుత్తిలేకుండా నో చెప్పింది.. నా వల్ల తన జీవితం పాడైపోయిందనే బాధ ఎలా తీరుతుంది..
నేనేం చెయ్యాలి…..