కట్టుకున్న భార్య కడదాకా ఉండకుండా మధ్యలోనే వదిలేసి వెళ్లింది. అయినా ఆమె జ్ఞాపకాలనే తలుచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు తమిళనాడు కోయంబత్తూర్లోని గణేశపురం గ్రామానికి చెందిన పళనిస్వామి. భార్య కోసం ఏకంగా గుడి కట్టించి విగ్రహం ప్రతిష్టించాడు. రోజూ ఆమె విగ్రహానికి పూజలు చేసి హారతులిస్తూ కాసేపు ముచ్చటిస్తున్నాడు.
పళనిస్వామి(75), సరస్వతి(59) భార్యాభర్తలు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పళనిస్వామి వృత్తిరీత్యా రైతు. అయితే 2019లో సరస్వతి బాత్రూమ్కు వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మరణించింది. పశనిస్వామి.. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. సరస్వతి మృతదేహాన్ని తోటలో పూడ్చిపెట్టారు కుటుంబ సభ్యులు.
మొదటి వర్థంతి సందర్భంగా తన భార్య సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత 3 ఏళ్లుగా పళనిస్వామి తన భార్య విగ్రహానికి రోజుకి రెండుసార్లు దీపం వెలిగించి పూజలు చేస్తున్నాడు. తన భార్యతో గడిపిన సమయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పళనిస్వామి తెలిపాడు. ప్రతి రోజూ ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నానని చెప్పాడు.