తెలంగాణలో ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నా.. ఇప్పటికే పార్టీల నేతలు రాజకీయంగా ఎదుర్కునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఎవరితో పొత్తు తమకు అవసరం లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై ఎక్కడా కూడా చర్చ జరగలేదని ఆయన అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతుందని మాణిక్ రావ్ ఠాక్రే విమర్శించారు.
రాష్ట్రంలో వైఫల్యం చెందితేనే పక్క రాష్ట్రాల్లో పోటీ చేయాలనే ఆలోచనలు వస్తాయన్నారు మాణిక్ రావ్ ఠాక్రే. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బీఆర్ఎస్ నెరవేర్చలేదని మాణిక్ రావ్ ఠాక్రే చెప్పారు. అబద్ధపు వాగ్దానాలను ఎండగట్టేందుకు ప్రజలకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. హాత్ సే హాత్ జోడో యాత్రను పెద్దఎత్తున విజయవంతం చేయాలని నాయకులను, ప్రజలను మాణిక్ రావ్ ఠాక్రే కోరారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న ప్రారంభించనున్నారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధిష్టానం నిర్ణయించింది.