మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోనున్నారా? అంటే తాజా పరిస్థితులు నిజమనే చెబుతున్నాయి. గత మూడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన లొంగుబాటుకు సంబంధించి తాజాగా ప్రభుత్వానికి, గణపతి అనుచరులకు మధ్య చర్చలు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. 74 ఏళ్ల గణపతి పీపుల్స్ వార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గత మూడేళ్ల క్రితమే ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్న ఆయన అనారోగ్యం కారణంగా కీలక పదవి నుంచి తప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
గత కొంత కాలంగా అనారోగ్యంతో వున్న ఆయనని క్యాడర్ దండకారణ్యంలో మోసుకుంటూ తిప్పుతున్నారు. ఇక వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని గణపతి లొంగిపోయి చికిత్స పొందాలన్న నిర్ణయానికి వచ్చారని, ఇంతకు మించి ఆయనకు మరో మార్గం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినట్టు తెలిసింది. మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగుబాటు కోసం తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ పోలీసులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్నారు. గణపతి లొంగుబాటు కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈయన లొంగు బాటుకు కేంద్రం కూడా సానుకూలంగా వున్నట్టు చెబుతున్నారు. గణపతి లొంగుబాటు లాంఛనమైతే ఆయనతో పాటు కీలక లీడర్ లు మరికొంత మంది కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా వున్నారట.
అదే జరిగితే మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశాలే అత్యధికంగా కనిపిస్తున్నాయని చర్చించుకుంటున్నారు. పీపుల్స్ వార్ పార్టీని ఆ తరువాత కాలంలో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందించడంలోనూ, దేశ వ్యాప్తంగా ఈ విప్లవ సామ్రాజ్యాన్ని విస్తరించడంలోనూ గణపతి కీలక భూమిక పోషించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని బీర్‌పూర్ గణపతి స్వగ్రామం. ఇప్పడది జగిత్యాల జిల్లాగా మారింది. RSU లో చేనిప ఆయన నక్సల్ ఉద్యమానికి పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరాడు.