రామమందిరం- బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీం కోర్టు తన తీర్పుతో చరమగీతం పాడింది. వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణానికి ఇస్తూనే.. ముస్లింలలకూ అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని తెలిపింది. ఇప్పుడు ఈ ఐదెకరాల స్థలంపై ముస్లిం వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయోధ్య కేసులో కక్షిదారైన సున్నీవక్ఫ్ బోర్డ్ కు మసీదు నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆ బోర్డు నవంబర్ 26న నిర్ణయం తీసుకోనుంది.
26న సమావేశం కానున్నసున్నీ వక్ఫ్ బోర్డు ఐదెకరాలు తీసుకోవాలా వద్దా అనేదానిపై చర్చించి నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. భూమి తీసుకోవాలా వద్దా అనే అంశంపై భిన్నమైన సలహాలు వస్తున్నాయని యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జుఫాల్ ఫరూఖీ అంటున్నారు. భూమి తీసుకోవద్దని.. కొందరు సూచిస్తున్నప్పటికీ, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు.
ఒకవేళ అయోధ్యలోనే ప్రభుత్వం ఇచ్చే ఐదు ఎకరాల్లో మసీదు నిర్మిస్తే ఏమవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ అదే జరిగితే భారత దేశ లౌకిక తత్వం ప్రపంచానికి మరోసారి వెల్లడయ్యే అవకాశం ఉంది. మసీదును కూడా రామాలయంలా ప్రతిష్టాత్మకంగా ఘనం నిర్మిస్తే.. ఒకే నగరంలో రెండు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు నెలకొన్నట్టు అవుతుందని లౌకిక వాదులు భావిస్తున్నారు.
రామమందిరం, మసీదు.. అయోధ్యలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లే అవకాశం ఉంది. చరిత్ర దృష్ట్యా వీటికి ఉన్న ప్రాముఖ్యత వీటి ప్రధాన ఆకర్షణ అవుతుంది. రెండు మతాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించే సంస్కృతి భారత దేశ ఔన్నత్యాన్ని మరోసారి ఘనంగా చాటే అవకాశం ఉంది. ఇది కేవలం అయోధ్య వరకే పరిమితం కాకుండా దేశమంతటా మతసామరస్యం నెలకొల్పుతుంది.