పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న కార్ల్ మార్క్స్ మాటలను గుర్తు చేసుకుంటూ ప్రపంచ కార్మికుల దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఎందరో జీవితాలని గుర్తు చేసుకుంటూ, కార్మికుల హక్కుల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా మే 1వ తేదీని అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారు.
చరిత్ర
19వ శతాబ్దంలో అమెరికాలో కార్మిక సంఘాల ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంది. అమెరికా, కెనడాలో ప్రతీ ఏటా సెప్టెంబర్ మొదటి సోమవారం రోజున కార్మికుల దినోత్సవంగా జరుపుకునేవారు. 1889లో కార్మిక సంఘాలు సమావేశం అయ్యి, మే 1వ తేదీనీ కార్మికుల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. 1886లో చికాగోలోని హేమార్కెట్ లో కార్మికుల ర్యాలీ జరుగుతుండగా, పోలీసుల మీద ఎవరో బాంబు విసిరారు. దాంతో ఆ ర్యాలీ హింసాత్మకంగా మారింది. అప్పుడు ఎనిమిది మంది దాకా మరణించారు. దాని జ్ఞాపకార్థం మే 1వ తేదీని అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో మొదటగా 1923లో చెన్నైలో మేడేని జరుపుకున్నారు.
కొటేషన్లు
ప్రపంచంలో కనుక్కున్న ప్రతీ అద్భుతం వెనక కార్మిక శక్తి ఉంది.. కార్మిక శక్తి లేకుండా అద్భుతమైనదేదీ ఇప్పటి వరకు కనుగొనబడలేదు.. ఆండ్రూ గైడ్
శ్రమించకుండా, చెమట చుక్క చిందించకుండా ఏదీ నీ దగ్గరకి రాదు. నీలో ఉన్న కార్మికుడిని బయటకి తీస్తేనే విజయం నీకు దక్కుతుంది..
ఒక పనిచేస్తున్నామన్నది అద్భుతమైన విషయం కాదు. ఆ పనిని సంతోషంగా చేస్తున్నామన్నదే అద్భుతమైనది.
మొదలు పెట్టకుండా ఏదీ పూర్తికాదు. ఆలోచనలతో కాలం గడిపేస్తే ఏదీ ఆచరణలోకి రాదు. చేయి కదిపి కృషి చేయాల్సిందే.