ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల సైనిక వ్యయాలు పెరగుతున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కలిపి 2.1 ట్రిలియన్ డాలర్లను తమ సైన్యం కోసం, ఆయుధాల కోసం వెచ్చిస్తున్నారు. ఈ జాబితాలో ఇండియా మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా… రెండో స్థానంలో చైనా, నాలుగో స్థానంలో యూకే, రష్యాలు ఉన్నాయి. శత్రు దేశాల నుంచి వచ్చే బెదిరింపులు, తమ దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు పలు దేశాలు తమ బడ్జెట్ నుంచి అధికంగా సైన్యంపై ఖర్చు చేస్తున్నాయి. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2021 నివేదికలో వెల్లడించింది.
యూఎస్ఏ 2021లో 801 బిలియన్ డాలర్లను తన సైన్యంపై వెచ్చించింది. అయితే ఇది గతంలో పోలిస్తే 1.4 శాతం తక్కువ. అమెరికా ఎక్కువ సైనిక పరిశోధనలకు నిధులను వెచ్చిస్తోంది. రెండోస్థానంలో ఉన్న చైనా తన మిలిటరీ పై 293 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఇది 2020తో పోలిస్తే 4.7 శాతం పెరిగింది. ఇండియా సైనిక వ్యయం 76.3 బిలియన్లను తన సైన్యంపై వెచ్చిస్తోంది. ఇది 2020తో పోలిస్తే 0.9 శాతం పెరిగింది. 2012 నుంచి పోలిస్తే 2021లో ఇండియా సైనిక వ్యయం 33 శాతం పెరిగినట్లు స్టాక్ హోమ్ నివేదిక వెల్లడించింది.