ఏపీలో వైసీపీ నేతలకు టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే..తాజాగా మరోసారి మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు బుధవారం తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి విమానం ద్వారా బెంగళూరు చేరిన చంద్రబాబు… అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్నారు. బుధవారం నుంచి మొదలైన చంద్రబాబు కుప్పం పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది.
ఈ సందర్భంగా కుప్పం పర్యటనకు చంద్రబాబు బయలుదేరుతున్న సమయాన ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు సంధించారు. ‘పదే పదే కుప్పం వెళ్తున్న బాబు గారు, కుప్పం మీద ప్రేమ పుట్టిందా?, కుప్పం అంటే భయం పట్టిందా?’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.