మునుగోడులో ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. మునుగోడు ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నారు నేతలు. అయితే.. మునుగోడు ఎన్నికల్లో ఓటర్లకు మాయమాటలు చెప్పి గెలిచేందుకు మరోసారి చేస్తున్న బీజేపీ మోసాన్ని ప్రజలు గుర్తించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చండూర్ మున్సిపాలిటీ 2, 3 వార్డులకు సంబంధించిన యువ సమ్మేళనం సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక, హుజూరాబాద్ లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రస్తుతం మునుగోడు ఎన్నికల్లోనూ అదే హామీతో ఓటర్లను మభ్యపెడుతుందని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి. బీజేపీ పాలనలో నిత్యావసర ధరలు పెంచారని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని విమర్శించారు మంత్రి ఎర్రబెల్లి.
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గుజరాత్ లో కాంట్రాక్ట్ పనుల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలను తీసుకొచ్చారని పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి. బీజేపీ అభ్యర్థి ఇస్తున్న హామీలకు మోడీ బాధ్యత వహిస్తాడా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని తొలగించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఇంటింటికి మంచినీరు, పింఛన్లు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని, అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.