టీఆర్‌ఎస్‌ నేతలకు అచ్చిరాని వైద్యారోగ్యశాఖ! హరీశ్‌రావుకు కేటాయింపు

-

ఉద్వాసనకు గురికాక ముందు వరకు ఈటల రాజేందర్ నిర్వర్తించిన వైద్యారోగ్యశాఖను హరీశ్‌రావుకు కేటాయించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు కొన్ని గంటల ముందే సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, వైద్యారోగ్యశాఖ టీఆర్‌ఎస్ నేతలకు ఆది నుంచి అచ్చిరాలేదనే చెప్పాలి. ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత బర్తరఫ్ గురికావడమో లేదా మరోసారి అవకాశం లభించని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆ శాఖను హరీశ్‌రావుకు అప్పగించారు. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తాటికొండ రాజయ్య తొలి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అప్పుడు ఆయనకు వైద్యారోగ్యశాఖను కేటాయించారు. దూకుడుగా వ్యవహరించిన అత్యంత అవమానకర రీతిలో బర్తరఫ్‌కు గురయ్యారు. రాత్రికి రాత్రే ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తాటికొండ రాజయ్య వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఏడాది కాలం మాత్రమే బాధ్యతలు నిర్వర్తించారు.

తాటికొండ రాజయ్య బర్తరఫ్ తర్వాత వైద్యారోగ్యశాఖ బాధ్యతలను సి. లక్ష్మారెడ్డి చేపట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి టర్మ్ పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగారు. కానీ, 2018, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మంత్రి పదవి దేవుడెరుగు. కనీసం తిరిగి ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాలేకపోయారు.

రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత మూడు నెలలు ఆలస్యంగా ఈటల రాజేందర్‌కు వైద్యారోగ్యశాఖను అప్పగించారు. తొలి నుంచీ కేసీఆర్‌కు ఈటలకు ఉప్పునిప్పుగానే కొనసాగింది. ఎలాగోలా రెండేండ్లపాటు మంత్రి పదవిలో కొనసాగిన ఆయనపై భూకబ్జా ఆరోపణలు సొంత పార్టీ నేతలే గుప్పించారు. దీంతో రాజయ్యకు ఎదురైన పరిణామమే ఈటలకూ ఎదురైంది. అత్యంత అవమానకర రీతిలో బర్తర‌ఫ్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఉప ఎన్నికలు, ఈటల గెలుపు తెలిసిన సంగతే.

సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్‌ ఎక్కువ. ముహూర్తాలు, వాస్తును కూడా నమ్ముతారు. అందుకే వాస్తు దోషం ఉన్న సెక్రటేరియట్‌‌లోకి ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు. అలాంటి గులాబీ బాస్ టీఆర్‌ఎస్ నేతలకు అచ్చిరాని వైద్యారోగ్యశాఖను హరీశ్‌రావుకు కేటాయించడంలో మతలబు ఏమిటని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఏదిఏమైనా లోగట్టు పెరుమాళ్లకు ఎరుకే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version