రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని నాలాల అభివృద్ధి, జీహెచ్ఎంసీ సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలు కీలక సూచనలు చేశారు. వర్షాకాలంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. జూన్ 1వ తేదీ నాటికి సన్నద్ధత పనులు పూర్తి కావాలన్నారు. వర్షాకాలం నాటికి పనులు పూర్తయితే ముంపును నివారించొచ్చు. నాలాల్లో ఉన్న అడ్డంకులు, పూడికను తొలగించాలి. వాటర్ లాంగింగ్ పాయింట్లు, రోడ్ల నిర్వహణపై శ్రద్ధ వహించాలన్నారు.
వాటర్ సీవరేజ్, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలన్నారు. మ్యాన్‌హోళ్ల నిర్వహణపై శ్రద్ధ వహించాలి. ప్రమాదానికి అవకాశం ఉన్న పాత భవనాల గుర్తింపు అత్యంత కీలకం అని కేటీఆర్ పేర్కొన్నారు. గడువులోగా పనులు చేయడంలో విఫలమవుతున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.