ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా వరుణుడు తన ప్రకోపాన్ని రాష్ట్రంపై చూపిస్తున్నాడు. కాస్త కూడా గెరువు ఇవ్వకుండా వర్షం కురుస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల పుణ్యమా అని ఎక్కడికక్కడ వాగులు,చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఇళ్లళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. తుఫాన్ కారణంగా ఏపీలో వర్షం తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ క్రమంలోనే మంగళగిరిలో మంత్రి నారాలోకేశ్ భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. కొత్తపేటలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ కుటుంబానికి రూ.5లక్షల చెక్కును అందజేశారు. అనంతరం రత్నాల చెరువు ప్రాంతంలో ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.వర్షం కారణంగా నష్టపోయిన బాధితులకు సహాయం చేస్తానని హామీనిచ్చారు. అంతేకాకుండా ముంపు ప్రజలకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టి సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.