గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో.. వరుణ దేవుడు శాంతించి, తన ఉధృతి తగ్గించి వర్షాలు తగ్గు ముఖం పట్టేలా చూడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉజ్జయిని మహంకాళిని వేడుకున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గురువారం వరుణ శాంతి హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్. అంతేకాకుండా.. ఈ నెల 17వ తేదీన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీ పనులను మంత్రి తలసాని మగ్గంపై ప్రారంభించారు.
బోనాల వేడుక నిమిత్తం సికింద్రాబాద్ పరిధిలోని 91 దేవాలయాల నిర్వాహకులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సాయం చెక్కులను అందజేశారు మంత్రి తలసాని. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువులు పూర్తిగా నిండిపోయాయని, గోదావరి నది గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నదని పేర్కొన్నారు మంత్రి తలసాని. వరుణ దేవుడు శాంతించాలని హోమం నిర్వహించినట్టు, సికింద్రాబాద్‌లో బోనాలు నిర్వహించనున్న నేపథ్యంలో 91 దేవాలయాలకు గాను 76 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్టు వెల్లడించారు మంత్రి తలసాని.