ఎప్పుడైతే పవన్ శ్రీకాకుళం వేదికగా యువశక్తి సభలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడటం, తనని తిట్టే మంత్రులపై ఫైర్ అయ్యారో..ఆ వెంటనే వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు కౌంటర్ ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. పవన్ ఎక్కువగా మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్‌లని ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడారు. దీంతో వరుసపెట్టి వారు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ పై మాటల దాడి చేయడం మొదలుపెట్టారు.
పవన్ సభ అవ్వగానే మొదట మాజీ మంత్రి పేర్ని నాని లైన్ లోకి వచ్చి విమర్శల వర్షం కురిపించారు. ఆ తర్వాత రోజా, రాంబాబు, అమర్నాథ్, అప్పలరాజు..ఇలా వరుసపెట్టి మంత్రులు పవన్‌ని టార్గెట్ చేశారు. ఇక గుడివాడ అమర్నాథ్ ఎక్కువ సమయం ప్రెస్ మీట్ పెట్టి పవన్‌ని విమర్శించారు. పవన్ లో ప్రవహించేది పసుపు రక్తమని, జనసేన పేరు చంద్రసేనగా మార్చుకోవాలని, తమకు చేతులు, చెప్పులు ఉన్నాయంటూ గుడివాడ ఫైర్ అయ్యారు.
అయితే అంతా కామన్ అనుకుంటున్నట్లు చంద్రబాబు ఏమైనా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై విమర్శలు చేస్తే..ఆయనని తిట్టడానికి కొందరు మంత్రులు వస్తారు. ఇక పవన్‌ని తిట్టడానికి మరికొందరు మంత్రులు వస్తారు. అసలు ఈ మంత్రులు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై, అభివృద్ధి పనులపై ప్రెస్ మీట్లు పెట్టారని, కేవలం చంద్రబాబు, పవన్‌ని తిట్టడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నారని, అందుకే ఏ మంత్రి ఏ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో జనాలకు కూడా తెలియట్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి ఇలా మంత్రులు చంద్రబాబు, పవన్‌ని తిట్టడం వల్ల వైసీపీ మైలేజ్ ఏమన్నా పెరుగుతుందా? అంటే అది డౌటే అంటున్నారు. మొత్తానికి మంత్రులు అంటే తిట్టడానికే అని ప్రజలు భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.