ఇటీవల కల్కి భగవాన్ ఆశ్రమాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. వందల, వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతున్నారు. వీటిని తనిఖీ చేసేందుకే ఐటీ శాఖ అధికారులకు రోజుల తరబడి సమయం పడుతోంది. ఈ మొత్తం అక్రమాస్తులు వేల కోట్లలోనే ఉంటాయని తెలుస్తోంది. దీనికితోడు కల్కి భగవాన్, అమ్మ భగవాన్ అజ్ఞాతంలోకి వెళ్లారు.
ఇప్పుడు ఈ ఆస్తులపై బాగా చర్చ జరుగుతోంది. అసలు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చినా అంతా భక్తులు ఇచ్చిందే.. అందుకే స్థానిక వైసీపీ ఎమ్మల్యే ఓ షాకింగ్ ప్రతిపాదన చేస్తున్నారు. కల్కి ఆశ్రమం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచి పెట్టాలని సత్యవేడు ఎమ్మెల్యే, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు.
కల్కి భగవాన్ అక్రమాస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. అజ్ఞాతంలో ఉన్న కల్కి ఆశ్రమం వ్యవస్థాపకుడు విజయ కుమార్ నాయుడు, పద్మావతిని కస్టడీలోకి తీసుకోవాలన్నారు. కల్కి ఆశ్రమానికి ఉన్న బినామీలు ఎవరో నిగ్గు తేల్చి నిజనిజాలు బయటపెట్టాలన్నారు. హవాలా మార్గం ద్వారా వచ్చిన విదేశీ సొమ్ము లోగుట్టు వెలికితీయాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. ?