ఆ ఎమ్మెల్యే భవిష్యత్ ని పక్క రాష్ట్రం నేత శాసిస్తున్నారా…!

-

వటవృక్షం కింద మరో చెట్టు ఎదగలేదని అంటారు. ఆ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అంతేనట. గురువే ఆయన్ని ఎదగనివ్వడం లేదట. చివరకు మంత్రి అయ్యే అవకాశానికి పంగనామం పెట్టారట. ఇంత జరిగినా.. ఆ ఎమ్మెల్యే మాత్రం గురువుగారిపట్ల తన విధేయత చాటుకుంటూనే ఉన్నారట….

మంత్రి పదవి రాకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ అసంతృప్తితో ఉన్నారట. రెండుసార్లు గెలిచిన తనను కాదని.. మొదటిసారి ఎమ్మెల్యే అయిన సీదిరి అప్పలరాజుకు కేబినెట్‌లో చోటు కల్పించడంపై గుర్రుగా ఉన్నారని టాక్‌. అయితే పొన్నాడకు మంత్రి పదవి రాకపోవడానికి ఆయన రాజకీయ గురువు.. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావే కారణమని వదంతులు కోడై కూస్తున్నాయి. పొన్నాడకు మంత్రి పదవి ఇస్తే.. శిష్యుడు తనకంటే ఎత్తుకు ఎదిగిపోతాడని భావించి మల్లాడి అడ్డుపడ్డారని లేటెస్ట్‌గా జరుగుతున్న ప్రచారం. అయితే మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తి ఉన్నా.. మల్లాడి కృష్ణారావుపై మాత్రం అదే విధేయత ప్రదర్శిస్తున్నారట పొన్నాడ.

ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గం. 2009లో ప్రజారాజ్యం తరఫున పొన్నాడ సతీష్‌ పోటీకి యత్నించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ గుత్తుల సాయి శ్రీనివాసరావుకు టికెట్‌ ప్రకటించారు. కానీ.. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో తనకున్న పరిచయాలతో మల్లాడి కృష్ణారావు చక్రంతిప్పి ఆ ఎన్నికల్లో పొన్నాడ సతీష్‌కు టికెట్‌ వచ్చేలా చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం చుట్టూ యానాం ఉంటుంది. ఇక్కడ మత్స్యకారులు ఎక్కువ. తన పట్టు సడలకుండా మల్లాడి ఆనాడు పొన్నాడను తెరపైకి తెచ్చారంటారు. ఆ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు సతీష్‌కుమార్‌.

2014 ఎన్నికల్లో పొన్నాడ పోటీ చేయలేదు. అప్పటికే వైసీపీలో కీలకంగా ఉన్న గుత్తుల సాయి, పితాని బాలకృష్ణలను కాదని మల్లాడి మరోసారి చక్రం తిప్పడంతో వైసీపీ 2019లో పొన్నాడ సతీష్‌కు టికెట్ ఇచ్చింది. ఈసారి కూడా స్వల్ప ఆధిక్యంతోనే గెలిచారాయన. తన విజయానికి రెండు కులాలే కారణమని సభలలో వ్యాఖ్యానించారు పొన్నాడ. వారికే ప్రాధాన్యం ఇస్తుండటంతో వైసీపీలోని ఇతర సామాజికవర్గాల వారికి మింగుడు పడటం లేదట. కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాల వారిలో అసహనం మొదలైందట. మండలస్థాయిలో గ్రూపు రాజకీయాలు జోరందుకున్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదట. ముమ్మడివరంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్నా పట్టనట్లు ఉన్నారట.

  1. మరి.. గురువుగారు చెప్పినట్లు నడుస్తున్నారో లేక.. ఆ రెండు వర్గాలే చాలనుకుంటున్నారో కానీ పొన్నాడ వైఖరిపై నియోజకవర్గంలో చర్చ మొదలైంది. గురువే ఆయన్ని ఎదగనివ్వడం లేదని.. ఆయన చెప్పినట్లే నడుచుకోవడం వల్లే వర్గాలు తయారవుతున్నాయని అనుకుంటున్నారు. దీంతో కొందరు పాపం.. పొన్నాడ అంటుంటే.. మరికొందరు పొన్నాడ భవిష్యత్‌ ఏంటి అని ప్రశ్నించుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version