వైఎస్ ‘బాట’ లో రేవంత్..!

-

కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఎన్న‌డూ లేని విధంగా దిగ‌జారిపోయిఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌రీ దారుణం. జీహెచ్ఎంసీలో కేవ‌లం 2 సీట్లే గెల‌వడం ప‌రిస్థితి తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తుంది. ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌గా ఉన్న పార్టీ కావ‌డం, పంతాలూ ప‌ట్టింపులు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఏ ఒక్క‌రూ భాధ్య‌త లేక‌పోవ‌డం కార‌ణాలు కాగా.. అసలు ఏ గొడవ లేకపోతే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది..?  తెలంగాణ కాంగ్రెస్ లో ఇవన్నీ మామూలే అనేది రాజకీయ విశ్లేషకుల మాట.

ఎప్పుడూ గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా కాంగ్రెస్ అందరికీ సుపరిచితం అయిపోయింది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతూ వస్తోంది. ఇదే సమయంలో టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు రిపేరు మొదలుపెట్టారు. కెసిఆర్ టి ఆర్ఎస్ పార్టీ పై నిరంతరం పోరాడుతూ వస్తున్నారు. తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని మరింత పటిష్టం చేసి , అధికారం వైపు నడిపిస్తానని నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపికకు కసరత్తు మొదలైంది. తనకు పదవి ఇస్తే తెలంగాణ అంతటా పాదయాత్రను చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తాను అని రేవంత్ ప్రకటించేశారు.

ఈ పదవి కోసం ఎంతో మంది పోటీ పడుతున్నా, అధిష్టానం మాత్రం రేవంత్ వైపు మొగ్గు చూపుతున్న క్రమంలో , ఆయన పాదయాత్ర వ్యవహారం తెరమీదకు వచ్చింది. నిజంగా రేవంత్ పాదయాత్ర చేపడితే, కాంగ్రెస్ కు మళ్ళీ జవసత్వాలు వస్తాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 2003 కు ముందు కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైన పరిస్థితులు ఎదుర్కొంది. ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి, సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పట్లో ఆయన పాదయాత్ర ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ లోని సీనియర్లు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. అయినా అధిష్టానాన్ని ఒప్పించి రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టి ,2004లో కాంగ్రెస్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తీసుకు రాగలిగారు. ఇప్పటికీ ప్రజల మనసుల్లో రాజశేఖరరెడ్డి చిరస్థాయి ముద్ర  వేయించుకున్నారు అంటే అది పాదయాత్ర ఫలితమే.

సరిగ్గా ఇప్పుడు 2003 ముందు ఉన్న పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. తెలంగాణలో ఉనికి  కోసం పోరాడుతోంది. మొన్నటి వరకు రెండో స్థానానికి పరిమితం అయినా, ప్రస్తుతం మూడో స్థానం కంటే కిందకు దిగజారే పరిస్థితుల్లో ఉంది . టిఆర్ఎస్ ,బిజెపి ఆ తర్వాత స్థానాన్ని ఎంఐఎం దక్కించుకుని నాలుగో స్థానంలోకి కాంగ్రెస్ వెళ్ళిపోయింది. ఈ విషయం గ్రేటర్ ఎన్నికలలో రుజువు అయ్యింది. ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ కనుక పాదయాత్ర చేపడితే,  కాంగ్రెస్ కు తిరిగి పునర్వైభవం రావడం అంత కష్టమేమి కాదు. గతంలో రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే జనాల్లోకి కాంగ్రెస్ ను తీసుకు వెళ్ళి సరికొత్త రికార్డును సృష్టించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ కు క్రేజ్ ఉంది. రాజశేఖర్ రెడ్డి – రేవంత్ ఇద్దరిని పోల్చుకుంటే , ఇద్దరూ మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకులే. అధిష్టానం కనుక రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి,  పాదయాత్రకు ప్రోత్సహిస్తే దివంగత రాజశేఖర్ రెడ్డి ని మరోసారి గుర్తు చేస్తూ కాంగ్రెస్ పై జనాల్లో ఆదరణ, సానుభూతి  పెరిగేలా చేయగలరు అనే  అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version