నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టటానికి ప్రజల్లోకి వెళ్లాలని తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇక ఈ ప్రజా చైతన్య యాత్ర కాన్సెప్ట్ మాత్రం చాలా కొత్తగా రూపొందించారు. తొమ్మిది నెలల జగన్ ప్రభుత్వంలో జరిగిన తొమ్మిది రద్దులు, తొమ్మిది మోసాలు, తొమ్మిది భారాలు.. అంటూ ఎజెండాను సిద్దం చేసుకున్నారు చంద్రబాబు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ అసమర్థంగా పాలన పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వాటి వలన రాష్ట్రంలో జరుగుతున్న నష్టాలను అన్నింటిని ప్రజలకు వివరించనున్నారు.
అయితే దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు కురిపించారు. తాను సంపాదించిన అక్రమార్జన వ్యవహారాలు బయట పడుతూ ఉండటంతో, ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి పదిసార్లు మాట్లాడేవాడట. ఆ కాల్ లిస్టు బయటకు తీస్తే దోపిడీ సొమ్ము సర్ధుబాట్లపై మరింత సమాచారం బయటికొస్తుంది. 2 వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకు ప్రజా చైతన్య యాత్ర అంటూ కొత్త నాటకం మొదలెట్టాడు” అని మండిపడ్డారు.