మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 3 న ఉపఎన్నిక పోలింగ్, నవంబర్ 6న ఓట్లు లెక్కింపు జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల కానుంది. అయితే వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. అంతకు ముందు జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కీలకంగా మారింది.
బిజెపి మునుగోడులో కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడుతుంటే.. మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకుంటే వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి తిరుగు ఉండదని టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అయితే బిజెపి, టిఆర్ఎస్ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి మునుగోడుని చేజిక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించనున్నదనే చర్చ ఆసక్తికరంగా మారింది.
అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 14వ తేదీన పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 7 వ తేదీ నుండి 14వ తేదీ వరకు సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సభలకు రేవంత్ రెడ్డి తో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరవుతారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రచారానికి వస్తారని ఆమె స్పష్టం చేశారు.