Fact Check: ముస్లింలు గంగాన‌దిలో ప్రార్థ‌న‌లు చేస్తూ ఆక్ర‌మించుకోవాల‌ని చూస్తున్నారా ? నిజ‌మెంత ?

-

సోష‌ల్ మీడియా అంటేనే ప్ర‌స్తుతం ఫేక్ న్యూస్‌కు అడ్డాగా మారింది. అందులో రోజూ అడ్డూ అదుపూ లేకుండా ఫేక్ న్యూస్ ప్ర‌చారం అవుతున్నాయి. ఇక తాజాగా మ‌రొక ఫేక్ న్యూస్ వైర‌ల్ అవుతోంది. కొంద‌రు ముస్లింలు గంగాన‌దిలో న‌మాజ్ చేస్తూ గంగాన‌దిని ఆక్ర‌మించుకునేందుకు చూస్తున్నార‌ని చెబుతూ ఓ వీడియోను ప్ర‌చారం చేస్తున్నారు.

మోకాళ్ల లోతు ఉన్న నీటిలో దిగిన కొంద‌రు ముస్లింలు గంగాన‌దిలో న‌మాజ్ చేస్తున్నార‌ని, వారు గంగాన‌దిని ఆక్ర‌మించాల‌ని చూస్తున్నార‌ని, దీంతో త్వ‌ర‌లోనే న‌ది ప‌రిస‌ర ప్రాంతాల్లోని ఇళ్ల‌ను కూడా ఆక్ర‌మిస్తార‌ని.. ఓ వార్త వైర‌ల్ అవుతోంది. అందులో ఓ వీడియో కూడా ఉంది. అయితే ఆ వార్త ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్ల‌డైంది.

ముస్లింలు మోకాళ్ల లోతు నీళ్ల‌లో నిల‌బ‌డి న‌మాజ్ చేస్తున్న మాట వాస్త‌వ‌మే కానీ.. అది ఇప్ప‌టి వీడియో కాదు, అస‌ల‌ది మ‌న దేశ‌మే కాదు. బంగ్లాదేశ్ లో 2020 మే నెల‌లో వ‌చ్చిన ఆంఫ‌న్ తుఫాను సంద‌ర్భంగా భారీ ఎత్తు నీరు చేరింది. బంగ్లాదేశ్ లోని కోయ్రా అనే ప్రాంతంలో వ‌ర‌ద నీరు చేరింది. దీంతో ఆ నీటిలోనే కొంద‌రు ముస్లింలు ఈద్‌-ఉల్‌-ఫిత‌ర్ సంద‌ర్బంగా ప్రార్థ‌న‌లు చేశారు. అదీ.. అస‌లు జ‌రిగిన విష‌యం.

కానీ దాన్ని మ‌న దేశంలో జ‌రిగిన‌ట్లుగా మార్చేశారు. క‌నుక ఇది క‌చ్చితంగా ఫేక్ న్యూస్ అని స్ప‌ష్ట‌మైంది. గ‌త ఏడాది మే 25వ తేదీన ఆ వీడియోను బంగ్లాదేశ్‌కు చెందిన అన్ని మీడియా చాన‌ళ్లు ప్ర‌సారం చేశాయి. స‌ద‌రు వీడియోకు చెందిన కీవ‌ర్డ్‌ల‌ను ఉప‌యోగించి దాన్ని ట్రేస్ చేయ‌గ‌లిగారు. వాస్త‌వాన్నివెల్ల‌డించ‌గ‌లిగారు. క‌నుక సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version