అగ్రరాజ్య ఎన్నికలు ముగిశాయి. భారత సంతతి మహిళ కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆమె పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఇండో- జమైకా మూలాలు గల ఆమె.. అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వేళ భారతీయులతో పాటు జమైకన్లు సైతం తమ ఆడపడుచు విజయాన్ని ఆస్వాదిస్తూ తనను అభినందిస్తున్నారు. ఇదే విధంగా తన కుటుంబసభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ, అమెరికా సెకండ్ జెంటిల్మెన్ కాబోతున్న కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమాఫ్ తెలిపిన అభినందనలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ క్రమంలో డగ్లస్ ఎమాఫ్ షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అటార్నీ జనరల్‌గా, సెనెటర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన భార్య ఏకంగా దేశ తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుడటంతో తన గుండె గర్వంతో ఉప్పొంగిపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కమలా హారిస్‌ను ఆత్మీయంగా హత్తుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు డగ్లస్. ‘‘నిన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది’’ అంటూ ఉద్వేగపూరిత క్యాప్షన్ జత చేశారు. ఆ పోస్టుకు స్పందిస్తున్న నెటిజెన్లు కమలా హారిస్‌ను చూసి అమెరికా మొత్తం గర్వపడుతోందని, ఒక మహిళగా, నల్లజాతి స్త్రీ గా ఆమె సాధించిన విజయం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు పెడుతున్నారు. జో బైడెన్ తన రన్నింగ్‌మేట్‌గా కమలా హారిస్ ను ప్రకటించిన తర్వాతి మొదటి ప్రసంగంలో భాగంగా.. ఆమె తన కుటుంబాన్ని పరిచయం చేస్తూ.. ‘‘నా భర్త డగ్, మాకు రత్నాల్లాంటి పిల్లలు ఎలా, కోల్ ఉన్నారు’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే కమలా హారిస్ తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్‌ను వివాహమాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా కలిగిన ఇద్దరు పిల్లలకు ఆమె అమ్మ ప్రేమను పంచుతున్నారు.