సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే జగన్ పాలన ఏ మాత్రం బాగా లేదని, అసలు ఆయన్ని సీఎంగా గుర్తించడం లేదని పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్, జగన్ మధ్య పచ్చగడ్డి వేస్తే రాజకీయంగా భగ్గుమనే పరిస్థితి! పవన్ కూడా కరోనా సమయంలో కూడా జగన్ పై టీడీపీ కి తోడుగా బలమైన విమర్శలే చేశారు. ఈ క్రమంలో… ఒక వైపు పవన్‌కల్యాణ్, జనసేన నాయకులు.. జగన్ సర్కార్ ఏమీ చేయలేదని విమర్శిస్తుంటే, అందుకు విరుద్ధంగా జనసేన నాయకుడు నాగబాబు మాత్రం.. జగన్ కొన్ని మంచిపనులు చేశారని, ఇంకా బాగా చేయడగలరని నమ్మకంగా చెబుతున్నారు.
జనసేన నాయకులు ఏమి మాట్లాడిన అది వారి వ్యక్తిగతం.. తాను ప్రకటించినా, తన పార్టీ అధికారిక సోషల్ మీడియాలో ప్రకటించినా.. వాటిని మాత్రమే పార్టీ అభిప్రాయాలుగా తీసుకోవాలి తప్ప, ఇంకెవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయంగానే అర్ధం చేసుకోవాలి.. అని నాగబాబు గాడ్సేపై స్పందించిన సమయంలో పవన్ స్పష్టం చేశారు. తమ్ముడు అలా అన్నాడనే ధైర్యంతో అనేశారో లేక అన్న ఇప్పిడిప్పుడే జగన్ కు దగ్గరవుతున్నట్లున్నాడు అనే హక్కుతో అన్నారో తెలియదు కానీ… జగన్ మంచి పనులు చేస్తున్నారు, బాగానే పాలన కొనసాగిస్తున్నారు అని అన్నారు నాగబాబు!
తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో “జగన్ గారు ప్రత్యర్థి పార్టీ అయినంత మాత్రాన ప్రతిసారి ఎదుటివారిని విమర్శించాలనే చెత్త ఆలోచన, రెగ్యులర్ రాజకీయ మానసిక మనస్తత్వం నాకైతే లేదు. జగన్ గారు చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి. వైద్యం, ఆరోగ్యశ్రీకి సంబంధించి, పోలీసులకు సెలవులు ఇవ్వడం లాంటివి కొన్ని ఉన్నాయి. కానీ ఆయన ఇంకా బాగా చేయగలరు. అంటే చేసింది తక్కువ. చేయనిది ఎక్కువ. కానీ రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం వైసీపీని, టీడీపీని కచ్చితంగా వ్యతిరేకిస్తాం” అని నాగబాబు జగన్‌పై ప్రశంసలు కురిపించారు.
సొంత పార్టీలోని కొందరు నేతలే పాలనపై విమర్శలు గుప్పిస్తున్న వేళ ప్రత్యర్థి పార్టీ నాయకుడు ప్రశంసలు కురిపిస్తే ఎలా ఉంటుంది? జనసేన పార్టీ కీలక నాయకుడు, ఆ పార్టీ అధినేత పవన్ కు అన్న అయిన నాగబాబు.. జగన్ పాలనపై చేసిన విధంగా ఉంటుందన్నమాట… ఆ కిక్కే వేరప్ప!