సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన గిరిజనుల జాతర నాగోబా జాతరకు. ఈ జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమ ఆరాధ్య దైవం నాగోబా దేవుడి అభిషేకానికి అవసరమైన గంగాజలం కోసం ఆదివాసీయులు గోదావరికి పాదయాత్రగా బయలుదేరారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు ప్రాంతంలోని గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు 151 మంది బయలుదేరారు.
కేస్లాపూర్ నుంచి బయలుదేరిన భక్తులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ అటవీ ప్రాంతం నుంచి పాదరక్షలు లేకుండా ఈ నెల 10న గోదావరికి చేరుకుంటారు. అక్కడ సేకరించిన జలంతో ఈ నెల 17న తిరిగి నాగోబా సన్నిధికి చేరుకుంటారు. జనవరి 21వ తేదీన రాత్రి 10 గంటలకు గంగాజలంతో నాగోబా దేవుడికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం మహాపూజ నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. ఈ జాతర వారం రోజులపాటు జరుగుతుంది. ఆలయ పీఠాధిపతి మెస్ర వెంకట్రావు, పూజారి కోసు ప్రధాన్‌దాదేరావు సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.