ఇటీవల బీజేపీ అధిష్టానం పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రాజును తొలగిస్తూ ఆ స్థానంలో పురందేశ్వరికి పగ్గాల అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పురందేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారని తెలియగానే, ఇక మంచి భాష వినొచ్చు అనే ఆలోచన వచ్చిందని వెల్లడించారు. “ఇతర అధ్యక్షుల మాదిరిగా పురందేశ్వరి బూతులు మాట్లాడే వ్యక్తి అయితే కాదు. ఇక నిరభ్యంతరంగా మన పిల్లలతో కలిసి వార్తలు చూడొచ్చు. నాయకులు అంటే ఇలా మాట్లాడాలి అని పురందేశ్వరిని చూపించి కుటుంబ పెద్దలు తమ పిల్లలకు చెబుతారు. పార్టీ నాయకులు అంటే బూతులు మాట్లాడేవాళ్లు కాదని పురందేశ్వరి ప్రజలకు చాటిచెప్పే విధంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది.
మేం కలిసి పనిచేశాం. ఈ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి, అధికారంలోకి తీసుకురావడానికి, దక్షిణాది కోటను బద్దలు కొట్టడంలో మా వంతు సహకారం పూర్తిగా అందిస్తాం” అని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.