ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి రెండో రోజు నారా లోకేశ్ సీఐడీ విచారణ ముగిసింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారని వెల్లడించారు. ఒక్క రోజు విచారణకు హాజరవ్వాలని హైకోర్టు చెప్పినా, సీఐడీ అధికారులు తనను రెండో రోజు కూడా విచారణకు పిలిచారని తెలిపారు. సీఐడీ అధికారుల కోరిక మేరకు తాను ఇవాళ కూడా విచారణకు వచ్చానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు. లంచ్ కు ముందు ఇవాళ తనకు బాహుబలి సినిమా చూపించారని అన్నారు.
“నా ముందు గూగుల్ ఎర్త్ తెరిచారు. హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన 9 ఎకరాల భూమి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పై ఎలా ఉంటుందో చూపించారు. ఆ విధంగా చూడడం నాకు మొదటిసారి. హెరిటేజ్ నాడు ఎన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసిందీ, ఏ సర్వే నెంబరు అనేది నాకు తెలుసు. కానీ ఇవాళ బాహుబలి సినిమా చూపించినట్టు పెద్ద స్క్రీన్ పై నీట్ గా చూపించారు.
దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే… ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల లోపల నుంచి వెళుతుందట. దానర్థం, ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల హెరిటేజ్ భూమిని కోల్పోయింది… ఇదీ ఇవాళ నేను తెలుసుకున్నది. మొత్తమ్మీద బాహుబలి సినిమా చూపించారు… దాని తర్వాత బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఏవేవో ప్రశ్నలు అడిగారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంతో నాకెలాంటి సంబంధం లేదు. అలైన్ మెంట్ లో నా పాత్ర లేదు. మా కుటుంబంలో ఎవరూ కూడా కోర్ క్యాపిటల్ రీజియన్ లో కనీసం ఒక గజం స్థలం కూడా కొనలేదు. గత పదేళ్లుగా మా కుటుంబ సభ్యుల ఆస్తులు అవసరం లేకపోయినా ప్రకటిస్తున్నాం. పేర్కొన్న దానికంటే ఒక్క గజం స్థలం ఎక్కువుందని నిరూపిస్తే, వాళ్లకు మా ఆస్తులన్నీ రాసిచ్చేస్తామని ఆనాడే చెప్పాను. ఇప్పటికీ నిరూపించలేదు.