జగన్ పాలనలో ఏపీ అధఃపాతాళానికి చేరిందన్నారు నారా లోకేష్. 15 వ రోజు పాదయాత్రలో బెల్లం రైతులను కలిసిన నారా లోకేష్ తో తమ కష్టాలను విన్నవించారు రైతులు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… జగన్ పాలనలో జే ట్యాక్స్ బెదిరింపుల దెబ్బకి భయపడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారని తెలిపారు.
ఒక్క అమరరాజా వెళ్లిపోవడం వలన దాదాపు 20 వేల మంది రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. అనంతపురంలో జాకీ పరిశ్రమను కూడా అక్కడ ఎమ్మెల్యే కమీషన్ల కోసం వత్తిడి చేసి తరిమేశారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. వైసిపి అధికారంలోకి వచ్చాక సుమారు రూ.10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో రాష్ట్రం అధఃపాతాళానికి దిగజారిపోయిందని ఫైర్ అయ్యారు.
తన సొంత ప్రయోజనాలు, అవినీతి సొమ్ము కోసం జగన్ రాష్ట్రప్రయోజనాలు, యువత భవిష్యత్తును బలిపెట్టారు. అందుకే టిడిపి అధికారంలోకి రాగానే రీబిల్డ్ ఏపి పేరుతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. పరిశ్రమదారులు, వ్యాపారస్తులకు టిడిపి పాలనలో ఎటువంటి వేధింపులు లేకుండా అన్ని అనుమతులు లభించేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకువస్తాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికాభివృద్ధి లో ఏపి నంబర్ 1. రాయలసీమ ను ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ హబ్ గా తయారు చేశాం. విశాఖకు ఐటి కంపెనీలు తీసుకొచ్చాం. అన్ని జిల్లాల్లో మైక్రో క్లస్టర్స్ ఏర్పాటు చేసి పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది తమ ఎజెండా అని చెప్పారు లోకేష్.