సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు మోడీ పాల్లొన్నారు. ఈ సందర్భంగా విశ్వరూప సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఆప్‌తో కలిసి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు. లిక్కర్ స్కాంలో రెండు పార్టీల ప్రమేయం ఉందన్నారు మోదీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్టు నటిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటేనే అవినీతికి నిదర్శనమన్నారు మోదీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండిటి టార్గెట్ బీజేపీనేనని, ఆదివాసీ మహిళను బీజేపీ పార్టీ రాష్ట్రపతిని చేస్తే.. కాంగ్రెస్ అందుకు వ్యతిరేకించిందని ప్రధాని మోదీ అన్నారు. దళితుడు కోవింద్‌ను బీజేపీ రాష్ట్రపతిని చేసింది. కానీ ఆయన్ని ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు మోదీ.
అంతేకాకుండా.. ‘దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదు. రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ కాపాడలేకపోయింది. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అన్ని విస్మరించింది. కొత్త రాజ్యాంగంతో కేసీఆర్.. అంబేద్కర్‌ను అవమానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులు.. ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి. ఇకపై మీరు ఏదీ అడగాల్సిన అవసరం లేదు. పార్టీలు చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేసేందుకు వచ్చాను. పార్టీలు చేసిన పాపాలకు నేను క్షమాపణలు చెబుతున్నా.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని బీఆర్ఎస్ చెప్పి.. మోసం చేశారు.. తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు.