రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనతంరం అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్‌కు నివాళాలర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో ప్రతిఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని చెప్పారు. ఇదిలా ఉంటే.. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి హోదాలో 9వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. అంతేకాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతేకాకుండా.. ఉదయం 10.30గంటలకు గోల్కొండలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.